Basar
‘Saraswathi Dwaya’ Kshetram – Basar (‘సరస్వతి ద్వయ’ క్షేత్రం – బాసర్)
II ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా II
‘శరదిందు సమాకారే పర బ్రహ్మ స్వరూపిణి , వాసరా పీఠ నిలయే సరస్వతీ నమో స్తుతే ‘
బాసర్ క్షేత్రం గురించి…
వాసరపురి / వ్యాసపురి / వాసర / బాసర / బాసర్ పవిత్ర గోదావరి తీర ప్రాంతంలో వెలిసిన అందరికీ తెలియని ప్రముఖ అనఘదత్త క్షేత్రం. ఎటుచూసినా కనువిందు చేసే ఔదుంబర వృక్షాలతో బాసర్ ఒక గొప్ప దత్తధామాన్ని తలపిస్తుంది.. అందరికీ సుపరిచితమైన శ్రీ మహా (జ్ఞాన) ‘సరస్వతి’ మాత క్షేత్రం బాసర్, అదేవిధంగా అందరికీ తెలియని శ్రీ నృసింహ ‘సరస్వతి’ స్వామి వారి క్షేత్రం కుడా! ఈవిధంగా బాసర్ ‘సరస్వతి ద్వయ’ క్షేత్రంగా భాసిల్లుతోంది. బాసరలో మహాసరస్వతి, మహాలక్ష్మి, మరియు మహాకాళీ మాతలు కొలువు తీరి ఉన్నారు. ఈ ముగ్గురి అమ్మల కలయికే అనఘాలక్ష్మి. అందువల్లనే బాసర్ క్షేత్రం ఒక గొప్ప దత్తక్షేత్రం మరియు ‘సరస్వతి ద్వయ’ క్షేత్రం. బాసరలో మహా (జ్ఞాన) సరస్వతి మాతకు ప్రతినిత్యం పాడే సుప్రభాతంలో 18 వ శ్లోకంలో “ఔదుంబరాఖ్య తరుమూల పవిత్ర దేశే, దత్తావధూత యతి రత్ర గృహిత దీక్షః జప్త్వాత్తదయ శుభనామ బభూవ సిద్ధః శ్రీవాణి వాసరపురే తవ సుప్రభాతం” అని ఉంటుంది. ప్రతినిత్యం అమ్మవారి నైవేద్య, అష్టోత్తర తదితర పూజలు “అవధూత చింతన శ్రీగురు దేవ దత్త! దత్త మహారాజ్ కి జై !” అనే వాక్యాలతోనే ముగుస్తాయి. అలాగే జ్ఞాన (మహా) సరస్వతి మాతకు తూర్పు వైపున ఔదుంబర వృక్ష ఛాయలో దత్తాత్రేయుడు మరియు దత్త పాదుకలు ఉన్నాయి. శ్రీగురుచరిత్ర లో 13 మరియు 14 అధ్యాయాలలో జరిగిన సంఘటనలు వాసర క్షేత్ర మహత్యాన్ని గూర్చి చెబుతాయి. అలాగే శ్రీ గురుడు (శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ్) తమ దేశాటనలో భాగంగా వాసర క్షేత్రంలో ఉండి అనుష్టానం చేసుకున్న ప్రదేశం, వారు ఉన్న గుహ మరియు అప్పటి దత్తాత్రేయ మందిరాన్ని నేటికీ ఇక్కడ మనం చూడవచ్చు. బాసరలో మహా (జ్ఞాన) సరస్వతి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. గురుదత్త మందిరం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి కాలంలో నిర్మించబడినది. దత్తాంశలైన నవనాథ సిద్దులలో అత్యంత ప్రముఖులైన శ్రీ మత్సేంద్రనాథుల వారు నడయాడిన పవిత్ర భూమి వాసర. శ్రీ మత్సేంద్రనాథుల వారి శిష్యులు శ్రీ మత్సేంద్రనాథుల వారికి క్షీరంతో పాదాభిషేకం చేసినప్పుడు పడ్డ ‘క్షీరధారలు’ నేటికి వాసర క్షేత్రంలో చూడవచ్చు.
బాసరలో జ్ఞాన సరస్వతీ దేవి ప్రతిష్ట - వాసర వృత్తాంతం
ఒకప్పుడు బాసరలో సరస్వతీ దేవిని ప్రతిష్ఠించిన వివరాలు తెలుసుకోవాలని నారదునికి ఆసక్తి కలిగింది. ఒకరోజు బాసరలో సరస్వతీదేవి వెలసిన వృత్తాంతం, అష్టతీర్థ మహిమలు తెలుపవలసిందిగా నారదుడు, బ్రహ్మదేవుని కోరుకున్నాడు. బ్రహ్మ వాటిని ఈవిధంగా వివరించడం ప్రారంభించాడు. “వ్యాసుడు నివసించిన కారణంగా ఈ ప్రాంతాన్ని ‘వ్యాసపురి’ అని పిలిచేవారు. ఇప్పటికీ ‘వాసర’ లేక ‘బాసర’ అని పిలుస్తున్నారు. ఇక్కడి సరస్వతీదేవి విగ్రహాన్ని వ్యాసుడు ప్రతిష్టించాడు” అని చెప్పాడు. అపుడు నారదుడు “బ్రహ్మదేవా! సరస్వతీ దేవి స్వయంగా ఆవిర్భవించిందని కొందరు, సరస్వతీ దేవిని వ్యాసుడే ప్రతిష్టించాడని కొందరు పరస్పర విరుద్ధంగా చెబుతున్నారు. ఈ సందేహాన్ని తొలగించు స్వామీ” అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షితో సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్టను వ్యాసుడు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాడు.
నారదా! ఆదికాలంలో సరస్వతీదేవి తనకు ఆవాస యోగ్యమైన స్థానం (‘వాస’ యోగ్యమైన స్థానం కాబట్టి ‘వాసర’) ‘వాసర’ (బాసర) అని భావించింది. అందుకే ఇక్కడ ఆమె జ్ఞాన సరస్వతి అయి వెలసింది. ఆమెను బ్రహ్మాది దేవతలు ప్రతిరోజూ వచ్చి సేవించేవారు. ఒకనాడు సరస్వతీ దేవి తన మహిమను ప్రకటించేందుకు, ఆలయం నుండి అంతర్థానమైంది. అప్పుడు ‘శబ్దస్వరూపిణి’ అయిన అమ్మవారి అంతర్థాన ఫలితంగా లోకం మొత్తం మూగబోయింది. మహర్షులు, దేవతలు, బ్రహ్మదేవుని వద్దకు వచ్చి జ్ఞాన సరస్వతి అంతర్థానం గురించి మూగ సైగలతో వివరించారు. ‘బ్రహ్మదేవా! ‘శబ్దస్వరూపిణి’ అనుగ్రహం పొందేందుకు మార్గం సూచించు” అని మూగ సైగలతో వేడుకున్నారు. వారి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు ‘వేదవ్యాసుని’ వలన సరస్వతీ దేవి తిరిగి వస్తుందని చెప్పి, వారిని వ్యాసమహాముని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించారు.
దేవతలు, మహర్షులు, వేదవ్యాసుని వద్దకు వెళ్ళారు. వారిని చూసిన వేదవ్యాసుడు వారి మనోభావం గ్రహించి నిశ్చల చిత్తంతో జ్ఞాన సరస్వతిని ధ్యానించాడు. సరస్వతీదేవి అనుగ్రహించి, వ్యాసునితో ‘ఓ వ్యాసమహామునీ! నీవు చేసిన స్తోత్రంతో ప్రసన్నురాలినయ్యాను. నా అనుగ్రహం వలన నీ కోరికలన్నీ నెరవేరగలవు. నీవు ‘వాసర’ నగరంలో నా సైకత విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించు. నన్ను ప్రతిష్టించగల శక్తిని నీకు మాత్రమే అనుగ్రహిస్తున్నాను’ అని పలికింది. వ్యాసమహాముని, సమస్త ఋషీగణంతో, దేవతా సమూహంతో, గోదావరి నదీ తీరంచేరి గౌతమీ నదిలో స్నానమాచరించి, నదిలో నుండి మూడు గుప్పెళ్ళు (ముష్టిత్రయ ప్రమాణం) ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను (మహా (జ్ఞాన) సరస్వతి, మహాలక్ష్మి, మరియు మహాకాళీ) ప్రతిష్టించాడు. సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని వ్యాసుడు పునఃప్రతిష్టించిన కారణం చేత ఇక్కడ సరస్వతీ దేవిని వ్యాసుడే ప్రతిష్టించినట్లైనది. అది ఆ తల్లి ఆజ్ఞ. జ్ఞాన సరస్వతీదేవి వాసర క్షత్రం లో క్రీ.పూ. 5000వ సంవత్సరంలో ద్వాపరయుగంలో మాఘమాస శుక్లపంచమి, మూలానక్షత్రం, శుక్రవారం రోజున, గోదావరి పుష్కరాలు జరుగుతుండగా వ్యాసమహర్షి వారిచే ‘ఐం’ బీజాక్షరయుతంగా సైకత విగ్రహంగా (ఇసుక విగ్రహం) ప్రతిష్టించబడినది. అందువల్లనే వాసర కు గల పూర్వనామం ‘పుష్కర పీఠికాపురం’. వ్యాసుడు విగ్రహం ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి ‘వ్యాసపురి’ అనే పేరు స్థిరపడింది.
ఎలా చేరుకోవాలి? ఎక్కడ ఉండాలి?
By Own Transport - Road (210 KMs. Approx. 5 Hrs. Journey) |
---|
By Own Transport - Road (210 KMs. Approx. 5 Hrs. Journey) |
Secunderabad ----> Bowinpally ----> Suchitra ----> Medchal ----> Manoharabad ----> Narsingi ----> Dichpally ----> Nizamabad ---->Navipet ----> Basar |
By Public Transport (Train) - Approx. 4 Hrs. Journey ( Rs. 85/- Ticket) |
---|
By Public Transport (Train) - Approx. 4 Hrs. Journey ( Rs. 85/- Ticket) |
Secunderabad / Kachiguda / Malkajgiri ----> Bolaram ----> Medchal ----> Kamareddi -----> Nizamabad ----> Basar Railway Station ( Basar Railway Station నుండి జ్ఞాన సరస్వతీదేవి దేవాలయమునకు మరియు గోదావరి నది వద్దకు దేవస్థానం వారు ఉచితంగా బస్సును నడుపుతున్నారు) |
బాసర్ క్షేత్రంలో ఉండడానికి దేవస్థానం వారి వసతీ సౌకర్యాలూ, TS Tourism వారి Haritha Resorts , ప్రైవేటు వసతీ సౌకర్యాలూ, కాటేజీలూ, సత్రాలు అనేకం కలవు. ప్రైవేటు లాడ్జిలకు Online Booking సౌకర్యం కుడా కలదు. సాధారణంగా బాసర్ క్షేత్రాన్ని Hyderabad నుండి ఒక్క రోజులో దర్శించుకొని తిరిగి రావచ్చు.
బాసర్ క్షేత్ర దర్శనానికి అనువైన సమయం
బాసర్ క్షేత్ర దర్శనానికి అన్ని కాలాలూ అనుకులమైనవే. వర్షాకాలం, చలికాలాలు అత్యంత అనుకూలమైనవి. వసంత పంచమీ (జ్ఞాన సరస్వతీదేవి జన్మదినోత్సవం), వ్యాస పౌర్ణమి, దసరా నవరాత్రుల రోజులలో ఉత్సవాలు జరుగుతాయి.
బాసర్ దత్తక్షేత్రం (శ్రీ నృసింహ సరస్వతి మహారాజ్ అనుష్టాన స్థలం) గురించి
శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అనుష్టానం చేసుకున్న ప్రదేశం శ్రీ పాపహరేశ్వర మందిరం రోడ్డులో జ్ఞాన సరస్వతీదేవి దేవాలయము నుండి కేవలం 1.5 KMs దూరంలో గుట్ట మీద కలదు. ఇక్కడ శ్రీ గురుడు తపస్సు చేసుకున్న గుహ, సొరంగం మరియు అతి సుందర, పురాతనమైన దత్తాత్రేయ దేవాలయం ఉన్నాయి. బాసర్ యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన రెండవ సంపూర్ణ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తమ దేశాటనలో భాగంగా వాసర క్షేత్రానికొచ్చి, క్షేత్రంలో ఉండి అనుష్టానం చేసుకున్నారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అనుష్టానం చేసుకున్న ప్రదేశం, వారు ఉన్న గుహ మరియు అప్పటి దత్తాత్రేయ మందిరం బాసర్ లో ఇప్పటికీ ఉన్నట్లు చాలామందికి తెలియదు.
ఇక్కడ గల దత్తాత్రేయ మందిరంలో ఉన్న దత్తాత్రేయుడు ఏకముఖంగా ఉండి, మిగిలిన ఇతర దత్తాత్రేయ విగ్రహాలతో పోల్చితే భిన్నంగా ఉంటాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఇక్కడగల గుహ నుండి నేరుగా సొరంగమార్గం ద్వారా శ్రీ పాపహరేశ్వర మందిరాన్ని చేరుకునేవారట. ప్రస్తుతం ఆ సొరంగమార్గం ముసివేయబడినది. అలాగే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఇక్కడ నుండే శిష్యసమేతంగా కాలినడకన గోదావరి నదికి వెళ్ళేవారట. ఆ విధంగా వెళ్ళే నడకమార్గంలో బురదలో పడ్డ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాద ముద్రలు దాదాపు 100 సంవత్సరాలపాటు ఉన్నాయట. ప్రస్తుతం ఇక్కడ దేవాలయ విశిష్టతను గురించి చెప్పే హోర్డింగ్ లను తెలుగు, ఇంగ్లీష్ , మరాఠి బాషలలో ఏర్పాటు చేసారు. దత్తభక్తులందరూ తప్పనిసరిగా చూసి తీరవలసిన దత్తక్షేత్రమిది.
.
బాసర్ గోదావరి నదీ ప్రాముఖ్యత
శక్తి ఒకచోటి నుండి ఇంకొక చోటుకు ప్రవహిస్తుంది. ఈ శక్తి ప్రవాహ (సంచార) స్థానములు ‘చక్రములు’. చక్రములు స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ మరియు సహస్రారము అను రకములుగా ఉన్నవి. గోదావరి నది కుడా శక్తి ప్రవాహరూపమే. అందువల్లనే నదులు పాపాలనూ, పాపులను శుద్ధి చేయగలుగుతున్నయి. గోదావరి నదిలో శక్తి ప్రవాహం సహస్రార చక్రస్థానమైన ‘త్రయంబకేశ్వరం’ నుండి నాశిక అగ్రభాగమైన ‘నాశిక్’, నాభి చక్రస్థానమైన ‘నాందేడ్’ గుండా మూలాధార చక్రస్థానమైన ‘బాసర్’ లోంచి ప్రవహిస్తుంది. అందువల్లనే బాసర్ వద్ద గల గోదావరి నదిలో అధిక కుండలినీ శక్తి ఉంటుంది. ఈ కారణం గానే గురుచరిత్రను లిఖించిన ‘శ్రీ గంగాధర సరస్వతి’ నాందేడ్ దాటిన తరువాతి నుండి బాసర్ వరుకు గల గోదావరినది భాగాన్ని ‘గోదావరి మూలాధార స్థానమ’ని వ్రాసాడు. పై కారణాల వల్ల బాసర్ లో గల గోదావరి నదీ స్నానం విశేష పుణ్య ఫలితాన్నిస్తుంది.
బాసర్ క్షేత్రం లో చూడవలసిన ప్రదేశాలు / ఆలయాలు
బాసర్ క్షేత్రం లో చూడవలసిన ప్రదేశాలు / ఆలయాలు |
---|
బాసర్ క్షేత్రం లో చూడవలసిన ప్రదేశాలు / ఆలయాలు |
1. కుక్కలగుడి - సొండిగాం వాగు గోదావరి లో కలిసే ప్రాంతంలో గలదు. దీనినే కుక్కుటేశ్వర ఆలయం అనికూడా అంటారు. |
2. సూర్యేశ్వరాలయం - గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద కలదు. అత్యంత మహిమగల దేవాలయమిది. ఒకప్పుడు ఇక్కడ 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుగల సూర్య యంత్రం ఉండేది. |
3. వ్యాసేశ్వరాలయం - జ్ఞాన సరస్వతీదేవి దేవాలయం క్యూ కాంప్లెక్స్ ప్రారంభంలో గలదు. ఇక్కడ శుకమహర్షి లింగం కలదు. |
4. వాల్మికేశ్వర లింగం - జ్ఞాన సరస్వతీదేవి దేవాలయం ఆఫీసు వద్ద, మహా కాళీ దేవాలయ మార్గంలో కలదు. |
5. బొర్రగణేష్ ఆలయం - మైలాపూర్ రోడ్డు లో కలదు. చదువుపై శ్రద్ధ లేనివారు తప్పక దర్శించ వలసిన దేవాలయమిది. |
6. పాపహరేశ్వర మందిరం - ఈ గుడి శ్రీ నృసింహ సరస్వతి అనుష్టాన స్థలం & దత్తాత్రేయ దేవాలయం వద్ద గలదు. ఇక్కడ అతి మహిమగల శ్రీరామ పాదుకలు ప్రతిష్టించబడినవి. |
7.పార్వతిమాత తపఃస్థలం - ఈ ప్రదేశం శ్రీ నృసింహ సరస్వతి అనుష్టాన స్థలం & దత్తాత్రేయ దేవాలయం ఎదురుగాగల గుట్టలయందు గలదు. ఇక్కడ గల పార్వతి అమ్మ వారిని 'ఏకవీరాదేవి' అని పిలుస్తారు. |
8. శ్రీ కుమారాచలం & జ్ఞాన సరస్వతీదేవి జన్మ స్థలం - స్కందుడు తపస్సు చేసిన స్థలమే శ్రీ కుమారాచలం. అందువల్లనే దీనిని స్కందాచలం అనికూడా అంటారు. జ్ఞాన సరస్వతీదేవి దేవాలయమునకు ఉత్తర దిక్కుగా ఈ కొండ గలదు. ఈ కొండపై గల గుహలోనే బాసర జ్ఞాన సరస్వతీదేవి జన్మ స్థలంకలదు. |
9. సరస్వతీ సరోవరం - జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి నిరాకారరూపమే ఈ సరస్వతీ సరోవరం. అమ్మ వారు వాసర నుండి అంతర్థానమైన తరువాత ఈ సరోవరం లోనే నిరాకారంగా ఉన్నారు. అటువంటి నిరాకార, సరోవరరూప మహాసరస్వతీదేవి అమ్మవారిని సగుణసాకార రూపంలోకి తిరిగి మార్చి ప్రతిష్టించినవారు వ్యాసమహర్షి. ఈ సరోవరంలో ఆశ్వీయుజమాస శుద్ధసప్తమి రోజున స్నానమాచరిస్తే విశేషఫలితం దక్కుతుంది. |
10. చింతామణి గణపతి దేవాలయం - ఈ దేవాలయం బాసర్ బస్టాండ్ కు దగ్గరగా గలదు. అత్యంత మహిమగల దేవాలయమిది. ఈ దేవాలయ దర్శనం అయితేనే బాసర యాత్ర పూర్తైనట్లు. వ్యాసగుహ నుండి అడ్డదారిలో సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. |
11. వేదశిల - బాసర్ బస్టాండ్ కుసరిగ్గా ఎదురుగా కలదు. వేదశిల దర్శనం వల్ల బుద్ధి వికసిస్తుంది. ఈ శిలను చిన్న చిన్న రాళ్ళతో మీటిన వింత ధ్వనులు వినిపిస్తాయి. ఈ ధ్వని తరంగాలకు బుద్ధిని వికసింపజేసే శక్తి కలదు. వ్యాసగుహ నుండి అడ్డదారిలో సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. |
12. మత్సేంద్రనాథ పాలధారలు - బాసర్ బస్టాండ్ కు తూర్పున గల కొండలలో శ్రీ మత్సేంద్రనాథుల వారు కనిపించిన 'శిలాచీలిక'; మరియు వారి శిష్యులు క్షీరాభిషేకం చేసినప్పుడు ఏర్పడ్డ 'క్షీరధారలు' ఇక్కడ నేటికి చూడవచ్చు. |
14. పార్వతి అమ్మవారి స్నాన నీటిధారలు - బాసర్ బస్టాండ్ కు ఎదురుగా గల ఈశాన్యం వైపున గల గుడి గుట్టలలో పార్వతి అమ్మవారి స్నాన జల ( నీటి) ధారలు కలవు. వ్యాసగుహ నుండి అడ్డదారిలో సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. |
15. వ్యాసగుహ - వ్యాసమహర్షి తపస్సు చేసుకున్న పుణ్య స్థలమిది. ఈ గుహ జ్ఞాన సరస్వతీదేవి దేవాలయ వెనుక వైపున మహాకాళీ అమ్మవారి దేవాలయానికి దగ్గరలో గుట్టమీద గలదు. |
16. నవనాథ సిద్దుల శిష్యుల సమాధులు - నవనాథ సిద్దుల శిష్యుల సమాధులు గోదావరి నది ఒడ్డున, పుష్కర్ ఘాట్ వద్దగల సూర్యేశ్వరాలయం ఎదురుగా కలవు. దత్త భక్తులు మరియు నవనాథ భక్తులు తప్పక దర్శించవలసిన ప్రదేశమిది. |
17. గురు దత్తాత్రేయ మందిరం - జ్ఞాన (మహా) సరస్వతి మాతకు తూర్పు వైపున ఔదుంబర వృక్ష ఛాయ లో గురు దత్తాత్రేయ మందిరం గలదు. ఈ మందిరం జ్ఞాన సరస్వతీదేవి దేవాలయ ప్రాంగణంలోనే కలదు. ఇక్కడ గల దత్త పాదుకలు అతి మహిమ గలవి. ప్రస్తుతం మనకి ఇక్కడ ఎండు ఔదుంబరం కనిపిస్తుంది. |
18.మహాకాళీ మందిరం - ఈ దేవాలయం జ్ఞాన సరస్వతీదేవి దేవాలయమునకు కుడివైపున పశ్చిమ భాగంలో కలదు. ఈ మాత అతి శక్తివంతురాలు. |
బాసర మహా (జ్ఞాన) సరస్వతి దేవాలయ వివరాలు
Basar Gnana Saraswthi Temple Address |
---|
Basar Gnana Saraswthi Temple Address |
Sri Gnana Saraswathi Devasthanam, Basara -504101 Mudhole (Mn) Adilabad (Dist.) Ph: 08752 - 243503 (Temple Open Between 04:00 AM And 08:30 PM. Temple Ramain Close Between 12:30 PM And 02:00 PM) |
బాసర్ క్షేత్రం ఫోటోలు
.
Jai Guru Datta