Pithapuram (పిఠాపురం/పీఠికాపురం)
Pithapuram (పిఠాపురం/పీఠికాపురం)
శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం
సంపూర్ణ శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లో శ్రీపాద శ్రీ చరణుల వారు అనేక చోట్ల చెప్పినట్లు గా వారి మహా సంస్థానం ఏర్పడినది. పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ భక్తులందరూ దర్శింపదగ్గ దివ్య ప్రదేశం “శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం”. ఇది పెద్ద బజారు సమీపం లో, వేణుగోపాల స్వామి వారి గుడి వీధిలొ గలదు. ఇచ్చటనే శ్రీపాద శ్రీ వల్లభుల వారి పాదుకలు ప్రతిష్టించబడినవి. ఇచ్చట గల పాదుకల దర్శనం మనలోని అణువణువును గురుభక్తి తో నింపుతుంది.
శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం – ఆవిర్భావం
కర్నాటక రాష్ట్రం లోని సజ్జనగడ ప్రాంతం లో నివసించే శ్రీ రఘువీర రామస్వామి వారు, మరియు వారి తల్లిగారైన శ్రీమతి కమలమ్మ గారు ఇరువురు 1966వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా పిఠాపురం రావడం జరిగింది. వారు కుక్కుటేశ్వర స్వామి వారి ప్రాంగణంలో గల స్వయంభూ దత్తాత్రేయుడిని పూజించి, గురుచరిత్ర ఒకసారి సప్తాహపారాయణ చేసిరి. అప్పటినుండి 11 సంవత్సరాల పాటు ప్రతీ సంవత్సరం వారిరువురు వచ్చి వెళుతుండేవారు. ఒకానొక సంవత్సరం వారి తీర్ధయాత్ర లో భాగంగా నర్సోబావాడి చేరిరి. అక్కడ నర్సోబావాడి నరిసింహ సరస్వతి సంస్థానం అధ్యక్షులు వారికి “ఇటువంటి సంస్తానమే పిఠాపురంలో కూడా ఉంటే బాగుంటుందని” సలహా ఇచ్చిరి. తరువాత రఘువీర రామస్వామి వారు, శ్రీమతి కమలమ్మ గారు పిఠాపురం వచ్చి కొంత మంది సభ్యులతో “శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం” అనే ఒక కమిటిని ఏర్పరిచిరి. శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంనకు కొంత స్థలమున్న బావుంటుందనే ఆలోచనతో శ్రీమతి కమలమ్మ గారు అనేక స్థలములను చూసిరి. అందరికి ఆమోదయోగ్య మైన స్థలమొకటి (పాత శిధిలావస్థలో ఉన్న ఇల్లు మరియు స్థలం) దొరికింది. కాని దానిని అమ్ము వారు ఆ స్థలం యొక్క ధర రూ. 35000/- చెప్పిరి. అంత డబ్బు కమిటి వద్ద లేకపోవడం చేత ఆ ప్రయత్నమును విరమించుకొనిరి. ఇదంతా సుమారు 1978-79 ప్రాంతాలలో జరిగింది. కొద్ది సంవత్సరముల తరువాత శ్రీమతి కమలమ్మ గారు అప్పుచేసైనా సరే ఆ స్థలాన్ని కొనవలెనని శ్రీపాదుల వారిచే ప్రేరేపింపబడినారు. అంతట 1983 వ సంవత్సరంలో అప్పు చేసి ఆ స్థలాన్ని కమిటి వారు కొన్నారు. అందులో గల పాత ఇంటిని శుబ్రం చేసి ఒక చిన్న ఆసనం వేసి దాని పై దత్తాత్రేయుడు, శ్రీ పాదుడి పటాలతో పాటుగా శ్రీధరస్వామి (ముందు జన్మలో శ్రీపాదుల వారి సహోదరులు) మరియు సమర్ధ రామదాసు పటములను ఉంచిరి. ఆచిన్న ప్రాంగణం లోనే ఆ చిన్న ఇంటి పక్కనే 1985వ సంవత్సరంలో ఔదుంబరమును నాటిరి (నేడు ఆలయ ప్రాంగణం లోపల కనిపించే ఔదుంబరం) ఆవిధంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ 1987వ సంవత్సరంలో మందిర నిర్మాణం జరిగినది. ఆ మందిరంలో 22-02-1988 లో మనం ఇప్పుడు చూస్తున్న శ్రీపాదుల వారి శ్రీ గురు చరణాలు (పాదుకలు) శ్రీ రఘువీర రామస్వామి (సజ్జనగడ రామస్వామి) వారి చేతుల మీదుగా ప్రతిష్టింపబడినవి. 06-02-1992 లో ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ పాద వల్లభ , దత్తాత్రేయ , నృసింహ సరస్వతి పాలరాయి విగ్రహాలు ప్రతిష్టించబడినవి.
Sripada Vallabha Divya Paadukalu (22-02-1988) & Sripada Samsthanam Gopuram
Oudumbara Tree in The Samsthanam Premises (Planted in 1985)
Sripada-Datta-Nrusimha Saraswathi Idols in Pithapuram Samstanam (Pratista on 06-02-1992)
స్వయంభూ దత్తాత్రేయుడు
పిఠాపురం లో శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం కాకుండా, అక్కడ గల ఇతర దర్శనీయ ప్రదేశాలు
దర్శనీయ ప్రదేశం | వివరణ |
---|---|
దర్శనీయ ప్రదేశం | వివరణ |
స్వయంభూ దత్తాత్రేయుడు | అత్యంత ప్రాముఖ్యత కలిగిన అతి ప్రాచీన దివ్య దత్తాత్రేయుడు పిఠాపురం స్వయంభూ దత్తాత్రేయుడు . ఈ దత్తాత్రేయుని గుడి కుక్కుటేశ్వర స్వామి వారి గుడి ప్రాంగణం లో ఉంది. ఇక్కడే అతి ప్రాముఖ్యత కలిగిన వందల ఏళ్ళ నాటి ఔదుంబర వృక్షం కూడా గలదు . "శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం" నందు అనేక సార్లు ఈ స్వయంభూ దత్తాత్రేయుని ప్రస్తావన ఉన్నది .ఈ స్వయంభూ దత్తాత్రేయుల విగ్రహం మాయం అయిపోవడం, తిరిగి అది ఏల నదిలో దొరకడం, సత్యరుషీశ్వర బాపనార్యులు గారి సలహా సహకారం తో సుమతి, అప్పల లక్ష్మీనరసింహ రాజ శర్మ దంపతులు ఈ విగ్రహాన్ని పునః ప్రతిష్టించడం వంటి ఎన్నో అంశాలు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లో మనము చదవవచ్చు. ఈ దత్తాత్రేయుని గుడి ప్రాంగణం లో శ్రీపాద శ్రీ వల్లభ విగ్రహం మరియు పాదుకలను మనము దర్శించవచ్చు. |
వేణుగోపాల స్వామి గుడి | శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానం నకు ఎదురుగా ఉన్నపురాతన గుడే వేణుగోపాల స్వామి గుడి, |
కుంతీమాధవ ఆలయం | అలాగే శ్రీపాద వల్లభ సంస్థానంనకు కూత వేటు దూరం లోగల కుంతీమాధవ స్వామి వారి ఆలయం కుడా చూడవలసిన ఆలయమే. కుంతీమాధవ స్వామి వారి ఆలయం కుడా అతి పురాతనమైన గుడే. కుంతిదేవి పూజించడం వల్ల ఇక్కడ గల మాధవ స్వామి వారికి కుంతీమాధవ స్వామి అని పేరు. ఈ గుడిలో స్వామి వారి తో పాటుగా కుంతీమాధవ స్వామి వారి మేడలోగల "ఓం నమో నారాయణాయ " అనే అతి విలువైన వజ్రాలు పొదిగిన, పిఠాపురం మహారాజా వారు చేయించిన లాకెట్ చూడవచ్చు. |
అనఘ - దత్త క్షేత్రం | పిఠాపురం నందు "అగ్రహారం " అనే ప్రాంతం లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి అద్భుతమైన దత్త దేవాలయం ఒకటి గలదు . ఇచ్చట దత్తుడు అనఘాదేవి సమేతంగా , పుత్రులైన అష్టసిద్దులతో గూడి ఉంటారు. ఇక్కడ గల శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి రాతి పాదుకలు అతి అతి విశిష్టమైనవి. ఈ పాదుకలందు వివిధ చిహ్నాలను మనం చూడవచ్చు. |
శ్రీ వెంకట కుమార త్రిముఖ లింగేశ్వరస్వామి ఆలయం | పిఠాపురం లో రామాటాకీసు దగ్గర స్టేట్ బ్యాంకు రోడ్డులో గల అత్యంత ప్రాచీనమైన " శ్రీ వెంకట కుమార త్రిముఖ లింగేశ్వరస్వామి" వారి గుడి కలదు . ఇక్కడ కుమారస్వామి మూడు ముఖాలతో , లింగాకృతి లో ఉండడం విశేషము |
ఉప్పాడ బీచ్ & ఉప్పాడ - మత్స్య లింగేశ్వర దేవాలం | పిఠాపురానికి 16 కిలో మీటర్ల దూరంలోఉప్పాడ బీచ్ కలదు.ఉప్పాడ లో సత్యరుషీశ్వర బాపనార్యుల వారిచే శక్తిపాతం గావింపబడిన శివుని గుడి తప్పక దర్శించవలసిన ప్రదేశం. |
బాపనార్యుల వారి గృహం | అలాగే పిఠాపురం లోని వంగల వారి వీధి లోగల (వంగల వారి వీధి శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం నకు అతి దగ్గరలో ఉంటుంది) శ్రీపాదుల వారి మాతా మహులైన బాపనార్యుల వారి గృహం తప్పక దర్శించ వలసిన ప్రదేశం. ఇక్కడ ప్రతి రోజు సాయంత్రం 06:00 గంటలకు శ్రీపాద శత నామావళి తో పూజ మరియు అత్యంత వైభవంగా పల్లకీ సేవ చేయబడతాయి. పైవన్నీ ఉచితంగా ఆ సాయానికి అక్కడకి వచ్చిన భక్తులందరికీ చేయడం విశేషం. పల్లకీ సేవ అనంతరం శ్రీపాద స్వామి వారికి ఉయ్యాల సేవ కుడా జరుగుతుంది. ఉయ్యాల సేవ లో కేవలం ఆడవారు మాత్రమే పాల్గొంటారు. మగవారు ఉయ్యాల సేవ ను చూడవచ్చు. ఇక్కడే శ్రీపాదుల వారి అసలైన చెక్క పాదుకలు పూజా గదిలో కలవు. వీటిని అడిగిన వారికి మాత్రమే చూపిస్తారు. ఉయ్యాల సేవ అనంతరం తీర్ధ , ప్రసాదాలు పంచడం తో ఇక్కడి కార్యక్రమాలు ముగుస్తాయి. |
శ్రీ గోపాల్ బాబా ఆశ్రమం | హైవే పైనగల విశాలమైన ప్రాంగణం లో గల శ్రీ గోపాల్ బాబా ఆశ్రమం కుడా తప్పక దర్శించ వలసిందే. ఈ ప్రదేశం లోనే ఒకప్పుడు "సవిత్రకాఠక చయనం" జరిగినట్లుగా చెపుతారు. ఇక్కడ రావి - వేప వృక్షాల మొదలు లో వెలిసిన దత్త పాదుకలను దర్శించ వచ్చు. ఇక్కడే "సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం" పుస్తకాలు కుడా దొరుకుతాయి. ఉదయం 10 గంటల లోపు అయితే శ్రీ గోపాల్ బాబా దర్శనం కూడా దొరకవచ్చు. |
అసలైన పురుహూతికా మాత గుడి | శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం నకు దగ్గరలో, శ్రీ బాపనార్యుల స్వగృహానికి అతి దగ్గరలో గల అసలైన పురుహూతికా అమ్మవారి గుడిని తప్పక చూడాలి. ఇక్కడ అసలైన పురుహూతికా మాత చెక్క పై చేయబడి ఉంటారు, అసలైన పురుహూతికా మాత చెక్క విగ్రహం ప్రక్కన సిమెంట్ విగ్రహం కుడా చూడవచ్చు. అసలైన పురుహూతికా శక్తి పీఠము ఇదే. కుక్కుటేశ్వర స్వామి వారి గుడి ప్రాంగణం లో గల పురుహూతికా మాత శక్తి పీఠ ఆలయం ఆవాహనం చేయబడినది. |
పిఠాపురం ఫోటోలు