Pragnapuram – ChanchalaBharathi (ప్రజ్ఞాపురం – చంచలభారతి)
Pragnapuram – ChanchalaBharathi (ప్రజ్ఞాపురం – చంచలభారతి)
II ఓం…శ్రీ… స్వామీ సమర్ధ…ఓం…శ్రీ… స్వామీ సమర్ధ…ఓం…శ్రీ… స్వామీ సమర్ధ…….II
ప్రజ్ఞాపురం – చంచలభారతి లేదా అక్కల్కోట శ్రీ స్వామీ సమర్ద మహారాజ్ గా పిలువబడే ‘అక్కల్కోట మహారాజ్’ (అక్కల్కోట్ కి గల అసలు పేరు “ప్రజ్ఞాపురం”) ఎవరో ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ తెలియదు. కాని వారు మాత్రం దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలలోను వివిధ పేర్లతో పిలువబడుతూ కనిపించారు. ఒకరకంగా చెప్పాలంటే వారు కాలుమోపని క్షేత్రం లేదు మనదేశంలో. కలియుగం లోని షోడస కళాపరిపూర్ణ సంపూర్ణ దత్తావతారాలలో అతి విశిష్టమైనది ఈ మూడవదైన “శ్రీ స్వామీ సమర్ద అవతారం”. నిజానికి ఈ మూడవ షోడస కళాపరిపూర్ణ సంపూర్ణ దత్తావతారమైన వీరి గురించి తెలిసినది బహుస్వల్పం. వారి పేరు, ఊరు, పుట్టు పూర్వోత్తరాలు, అసలు వారు ఎవరో ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ తెలియదు. వారు షోడస కళా పరిపూర్ణ సంపూర్ణ దత్తావతారమే కాక సంపూర్ణ అవధూత స్థితిలో ఉన్న ఏకైక దత్తావతారం. ఎక్కడా స్థిరంగా ఉండని వారు 22 సంవత్సరాల పాటు అక్కల్కోట్ లో ఉండడం వల్ల ‘అక్కల్కోట మహారాజ్’ అనీ ‘అక్కల్కోట నివాసి’ అనీ ఏదైనా చేయగల సమర్ధులు కాబట్టి స్వామీ ‘సమర్ద’ అనీ అప్పటి ప్రజలు పిలుచుకునే వారు. అసలైన దత్తతత్వానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ స్వామీ సమర్ద. వారు మాట్లాడే ప్రతి మాట ఎవరో ఒక భక్తుడిని లక్ష్యంగా (టార్గెట్) చేసుకొని ఉంటుంది. ఏందుకంటే ఎవరు ఎలాంటి వారో వారికి మాత్రమే తెలుసుగనక… ఎవరికి ఎలా చెబితే దారిలోకి వస్తారో వారికి మాత్రమే ఎరుక కనుక. అయన లీలలు, చేష్టలు అంతు చిక్కనివి. శ్రీ స్వామీ సమర్ధ ఒక ‘అత్యాశ్రమి’ (బ్రహ్మచర్య,గృహస్థ,వానప్రస్థ,సన్యాసాశ్రమాలు నాలుగింటికీ అతీతుడు అయినవాడు). మాటలో కరుకుదనం, చూపుల్లోని తీక్షణత, భారి ఆకారం , వొళ్ళంతా మట్టి పూసుకుని నగ్నంగా తిరగడం వంటి వారు చేసే పనుల వల్ల దత్తతత్వం అర్ధం చేసుకుని వంటపట్టించుకున్న భక్తులకు మాత్రమే వారి సహచర్యం దక్కింది. దత్త భక్తులందరూ తప్పక దర్శించవలసిన దివ్యక్షేత్రం “ప్రజ్ఞాపురం (అక్కల్కోట్)”
అక్కల్కోట్ ఎలా చేరుకోవచ్చు…
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా... |
---|
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా... |
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా సులభంగా హైదరాబాద్ నుండి అక్కల్కోట్ చేరుకునే విధానం: APTDC వారు ప్రతీ రోజు ఉదయం మరియు రాత్రి హైదరాబాద్ నుండి షోలాపూర్ వరుకు Non AC బస్సులు నడుపుతున్నారు (టికెట్ ధర 390/-) వాటి ద్వారా షోలాపూర్ చేరుకొని అక్కడనుండి గల ST బస్సుల ద్వారా లేదా నిముష నిముషానికీ అందుబాటులోగల జీపుల ద్వారా అతి సులభంగా అక్కల్కోట్ చేరవచ్చు. ఈ అన్ని జీపులు నేరుగా యాత్రినివాస్ లేదా భక్తనివాస్ గేటు దగ్గరే ఆగుతాయి. |
APTDC Hyderabad To Solapur Tour Enquiry Phone Numbers: HimayatNagar:04023414334, Tankbund Road:04065581555, Basheerbagh: 04066745986, Kukatpally: 04023052028, Secunderabad (Yatrinivas): 04027893100, Silparamam: 04023119557 |
సొంత వాహనాల ద్వారా... (Hyderabad To Akkalkot Via Manik Nagar : Around 300 KMS) |
---|
సొంత వాహనాల ద్వారా... (Hyderabad To Akkalkot Via Manik Nagar : Around 300 KMS) |
అక్కల్కోట్ కి సొంత వాహనాలలో వెళ్లాలనుకునే వారికి సులభమైన రూట్: కుకట్ పల్లి---> మియాపూర్---> BHEL---> పటాన్ చెరు--->ORR---> ORR దగ్గర స్ట్రైట్ రోడ్డు తీసుకోవాలి--->కంది---> పోతిరెడ్డిపల్లి---> సదాశివపేట--->జహీరాబాద్---> మన్నెకహెల్లి---> హుమ్నాబాద్ (హుమ్నాబాద్ నుండి కేవలం 2 కీ.మీ ల దూరం లోనే మాణిక్ నగర్ కలదు, ఇక్కడ బ్రేక్ జర్నీ చేసి, మాణిక్ ప్రభు ఆశీస్సులు తీసుకొని అక్కల్కోట్ వెళ్ళడం మంచిది)---> బసవకల్యాణ్ T- జంక్షన్ (అడ్డ రోడ్డు)---> ఉమర్గా---> జాల్కొట్---> నల్దుర్గ్ ఘాట్ రోడ్ ---> నల్దుర్గ్ ఘాట్ రోడ్ పూర్తైన వెంటనే వచ్చే ఎడమచేతి వైపుగల రోడ్డు తీసుకోవాలి---> సుల్తాన్ పూర్---> హన్నూర్---> చపాల్గావ్---> అక్కల్కోట్. దయచేసి గమనించండి పోతిరెడ్డిపల్లి నుండి నల్దుర్గ్ వరుకు రూట్ బావుండదు. ఈ మొత్తం ప్రయాణం దాదాపు 300 కీ.మీ. (ఒక వైపు) |
వసతీ గృహాలు…
అక్కల్కోట్ లో స్వామి సమర్ధ ట్రస్ట్ వారు నడుపుతున్న యాత్రీనివాస్ మరియు భక్తనివాస్ అనే వసతీ గృహాలే కాకుండా అక్కల్కోట్ లో అనేక లాడ్జిలు, ధర్మశాలలు కలవు. దాదాపుగా ప్రతీ వసతీ గృహానికీ క్యాంటిన్ సదుపాయం కుడా అనుసంధానింపబడిఉంది. వటవృక్ష మందిర్ దగ్గర ప్రతీరోజు మధ్యాహ్నం మరియు రాత్రి ఉచిత అన్నప్రసాద వితరణ కుడా కలదు.
ప్రజ్ఞాపురం – చంచలభారతి గురించి…
విషయము | వివరణ |
---|---|
విషయము | వివరణ |
అసలు పేరు | తెలియదు |
జన్మ తిథి తేది సంవత్సరం | తెలియదు |
తల్లిదండ్రులు | తెలియదు |
కులం & గోత్రం | తెలియదు |
స్వామీ సమర్ద కు భక్తులు పెట్టుకున్న పేర్లు | దిగంబరబువ, చంచలభారతి, నరసింహభారతి, నృసింహభాన్ , అక్కల్కోట నివాసి, అక్కల్కోట మహారాజ్, శ్రీ స్వామీ, శ్రీ స్వామీ సమర్ద మహారాజ్, పూరీ జగన్నాధము లో శ్రీ స్వామీ సమర్దని "వృద్ధ నృసింహసరస్వతి" అని పిలిచేవారు, ద్వారక లో శ్రీ స్వామి సమర్ధ "శ్రీ కృష్ణ దత్తాత్రేయ నరసింహ ముని" అని పిలవబడ్డారు, శ్రీ కృష్ణ సరస్వతి శ్రీ స్వామీ సమర్ధ ని "తాత్యా సాబ్" (గౌరవనీయులైన పెద్దాయన) అని పిలిచేవారు. |
ముఖ్య శిష్యులు | శ్రీ కృష్ణ సరస్వతి (అతిగా ప్రాచుర్యం పొందని అతి ప్రియమైన శిష్యుడు), బాలప్ప, చోళప్ప, బీడ్కర్ మరియు స్వామి సుత్ (అసలు పేరు: హరిభావ్ తవాడే ఖోట్) |
అవతార సమాప్తి దినం | 1878, చైత్ర శుద్ధ త్రయోదశి, మంగళ వారం సాయంత్రం 4 గంటలకు |
స్వామీ సమర్ధ రూపు రేఖలు |
---|
స్వామీ సమర్ధ రూపు రేఖలు |
ఆజానుబాహులు (వారు నిలబడితే శ్రీ స్వామి చేతులు వారి మోకాళ్ళదాకా ఉండేవి) |
శరీర పొడవు (దాదాపుగా) 7 అడుగులు |
విశాలమైన భుజములు |
తేనే రంగు పెద్ద కళ్ళు |
తీక్షణమైన చూపు |
పెద్ద పొట్ట |
పెద్ద పలుచటి చెవులు |
పొడవైన పాదాలు |
ఎక్కువగా కౌపీనం (గోచిగుడ్డ) ధరించే వారు |
మేడలో తులసిమాల,స్పటిక మాల, రుద్రాక్ష మాలలు వేసుకొని ఉండేవారు |
ఎక్కువగా హింది, మరాఠి భాషలు మాట్లాడుతుండేవారు |
దగ్గరకి వచ్చిన వారిని బండ బూతులు తిట్టడం లేదా కొట్టడం చేసేవారు |
అతి వేగంగా నడిచేవారు |
తక్కువగా, సూటిగా, గుచ్చినట్లు గా మాట్లాడేవారు |
భక్తులు పాదపూజ, నమస్కారములు చేసుకొనుటకు వీలుగా పాదాలను బైటపెట్టి మొహమంతా నిండా గొంగళి కప్పుకొని పడుకునేవారు |
తరచుగా హారతి ఇప్పించుకునే వారు |
మడి, ఆచారవ్యవహారాలంటే చెంప చెళ్ళుమనించే వారు |
శ్రీ స్వామి సమర్ధ కి ప్రీతికరమైనవి (ఇష్టమైనవి) |
---|
శ్రీ స్వామి సమర్ధ కి ప్రీతికరమైనవి (ఇష్టమైనవి) |
కాషయరంగు పువ్వులు |
గోవులు, కుక్కలు మరియు 'సుందరి' అనే కోతి |
గోళీలాట |
ఉంగరాలతో ఆడే ఆట |
బేసిన్ లడ్డు |
దద్ధోజనం - నిమ్మకాయ పచ్చడి |
జంతికలు |
ఉల్లిపాయ కూర |
శ్రీ చంచలభారతి (శ్రీ స్వామీ సమర్ద) దర్శించిన క్షేత్రాలు / ప్రాంతాలు |
---|
శ్రీ చంచలభారతి (శ్రీ స్వామీ సమర్ద) దర్శించిన క్షేత్రాలు / ప్రాంతాలు |
క్రీ.శ. 1756 - క్రీ.శ. 1757 మధ్య : కర్ధలీవనం, చిలిఖేడా గ్రామం, హరిద్వార్, ఋషీకేష్, బదరీనారాయణం, కేదారనారాయణం, గంగోత్రి, యమునోత్రి, నందాదేవి, కైలాస శిఖరం, వారణాశి, కలకత్తా, అయోధ్య, ద్వారక |
క్రీ.శ. 1758 : చైనా / నేపాల్ అడవులు, సరిహద్దులు |
క్రీ.శ. 1759 - క్రీ.శ. 1837 మధ్య : పూరీ జగన్నాధము, నారాయణ సరోవర్ (గుజరాత్), ద్వారక, గొమతీ తీర్ధం, గిరినారాయణ్ (గిర్నార్), హనుమాన్ తీర్ధం, అంబాజోగ్ (మహారాష్ట్ర), రామేశ్వరం, కంచి, వడవత్ రాజూర్ గ్రామం, ఉడిపి, పండరిపురం, మాతాపురం, కరవీరము, పంచాలేశ్వర్, ఔదుంబర్, కరంజా, బేగంపూర్, గణగాపూర్, హైదరాబాద్ |
క్రీ.శ. 1838 : మంగళవేథ గ్రామం |
క్రీ.శ. 1850 : మాహోల్ గ్రామం |
క్రీ.శ. 1855 : షోలాపూర్ |
క్రీ.శ. 1856 : ప్రజ్ఞాపురము (అక్కల్కోట్) |
శ్రీ స్వామీ సమర్ధ సాక్షాత్కారం - భూమిపై మూడవ దత్తావతార (శ్రీ స్వామీ సమర్ధ) నవావతరణ
శ్రీ స్వామీ సమర్ధ ఎప్పుడు పుట్టారు అనేది ఒక సమాధానం లేని ప్రశ్న. కాని కలియుగం లోని దత్తావతారాలైన మూడు షోడశ పరిపూర్ణ అవతారాలు (శ్రీపాద, నృసింహ సరస్వతి, శ్రీ స్వామీ సమర్ధ) ఎప్పటినుండి ప్రారంభమయ్యమ్యో, ఎప్పుడు ఈ అవతారాలకి బీజం పడిందో “నానా రేఖి ” వేసిన జాతకచక్రం మనకు చెబుతుంది. నానా రేఖి శ్రీ స్వామీ సమర్ధ యొక్క రెండు హస్తాలను చదివి వేసిన కుండలి ప్రకారం కలియుగం లో మొదటి దత్తావతారానికి బీజం క్రీ.శ. 1137 (హిందూ శకం 1071 – చైత్ర శుద్ధ విదియ) ఏప్రిల్ 30 న పడిందని తెలుస్తోంది. అందుకనే సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లో కుడా క్రీ.శ. 1320 భాద్రపద శుద్ధ చవితి రోజు పిఠాపురం లో శ్రీ పాద శ్రీ వల్లభుడు పుట్టక ముందు నుండే వారు భూమిపై అవతరించారని చెప్పడం జరిగింది. ఇక్కడ స్వామీ సమర్ధ అవతరణ గురించి చెప్పాలంటే రెండు సిద్ధాంతాల ద్వారా వారి అవతరణను వివరించవచ్చు.
సిద్దాంతం 1: క్రీ.శ.1458 లో నృసింహ సరస్వతి స్వామి శ్రీశైలం లోని కదళీవనం (కర్ధలీవనం) లో అంతర్ధానమయ్యాక దాదాపు 300 సంవత్సరాలు మహాసమాధి లో ఉండి వారి మూర్తిత్వంలో అనేక మార్పులు వచ్చి శ్రీ స్వామీ సమర్ధ రూపురేఖలు దాల్చి కట్టెలు కొట్టుకొను వాని వలన ‘స్వామీ సమర్ధ’ గా బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా మొదటి సిద్దాంతం చెపుతోంది.
సిద్దాంతం 2 – (శ్రీ స్వామీ సమర్ధ కుడా ఆమోదించిన సిద్దాంతం): క్రీ.శ.1458 లో నృసింహ సరస్వతి స్వామి శ్రీశైలం లోని కదళీవనం (కర్ధలీవనం) లో అంతర్ధానమయ్యాక దాదాపు 300 సంవత్సరాలు మహాసమాధి లో ఉండి, లోకోద్ధారణ నిమిత్తం 8 సంవత్సరాల బాలుడిగా ఉత్తరప్రదేశ్ లోని హస్తినాపురం దగ్గరగల ‘చెలికేడా’ గ్రామం లో కనిపించడం జరిగింది. అక్కడనుండి శ్రీ స్వామీ సమర్ధ అనేక పేర్లతో పిలవబడుతూ, దేశద్రిమ్మరియై (Gypsy) ‘చంచలభారతి’ గా ఖ్యాతి పొంది అనేక క్షేత్రాలు తిరిగి చివరకు క్రీ.శ. 1856 లో ప్రజ్ఞాపురము (అక్కల్కోట్) చేరారు.
శ్రీ స్వామీ సమర్ధ జాతకచక్రం – కుండలి
"నానారేఖి" అనే గొప్ప జ్యోతిష్యుడు వేసిన శ్రీ స్వామి జాతక చక్రం మరియు శ్రీ స్వామీ సమర్ధ అన్నివిధాల ఆమోదించిన జన్మకుండలి వివరాలు |
---|
"నానారేఖి" అనే గొప్ప జ్యోతిష్యుడు వేసిన శ్రీ స్వామి జాతక చక్రం మరియు శ్రీ స్వామీ సమర్ధ అన్నివిధాల ఆమోదించిన జన్మకుండలి వివరాలు |
జన్మనామం : చైతన్య స్వామి |
నామం : నరసింహభాన్ |
జన్మ తిథి : చైత్ర శుద్ధ ద్వితీయ |
నక్షత్రం : అశ్వని - ద్వితీయ పాదం |
యోగం : ప్రీతి |
జనన సమయం : సూర్యోదయానికి రెండు ఘటికల ముందు ( సోర్యోదయానికి 48 నిముషాల ముందు) |
సంవత్సరం : బహుధాన్య (1071) |
నాడి : ఆద్య |
గణం : దేవ |
రాశి : మేష (Aries) |
రాశ్యాధిపథి : కుజుడు (మంగళుడు) |
లగ్నం : మీన |
కులం: బ్రాహ్మణ - యజుర్వేద |
గోత్రం : కాశ్యప |
అక్కల్కోట్ లో ఏమేం చూడాలి…
(1) వటవృక్ష మందిర్
(2) చోళప్ప – చోళప్ప మందిర్
క్రీ.శ. 1856 అశ్వనీ శుద్ధ పంచమి రోజు అహ్మద్ ఆలీఖాన్ అనే వ్యక్తి ద్వారా అక్కల్కోట్ లోని ఖండోబా మందిర్ నుండి చోళప్ప గృహానికి వచ్చారు శ్రీ స్వామి. తరచుగా చోళప్పది- నాది జన్మజన్మల బంధం అని చెబుతుండేవారు. శ్రీ స్వామి చోళప్ప ఇంట్లో ఉండడం చోళప్ప భార్యా, పిల్లలకు ఇష్టం లేదు. అయినప్పటికీ కొద్దిరోజుల తరువాత శ్రీ స్వామి వారింట్లో ఒక సభ్యుడిగా అయ్యారు. స్వామి సమర్ధ పోషణార్ధం అప్పటి అక్కల్కోట్ రాజైన శ్రీ మాలొజీ రాజు కొంత రోక్కాన్ని ప్రతీ నెలా చోళప్ప ఇంటికి పంపేవారు. క్రీ.శ.1878 చైత్ర శుద్ధ త్రయోదశి, మంగళ వారం సాయంత్రం 4 గంటలకు శ్రీ స్వామి సమర్ధ తమ భౌతిక దేహాన్ని విడిచారు. స్వామి సమర్ధ నిర్యాణం అనంతరం శ్రీ స్వామి వారి భౌతికదేహం చోళప్ప గృహంలోనే సమాధి చేయబడినది. శ్రీ స్వామి సమర్ధ భౌతికదేహాన్ని పద్మాసనం లో కూర్చోబెట్టి చోళప్ప గృహం లోని నేలమాళిగ (Underground) లో ఉంచి సమాధి చేసారు. ఆవిధం గా ఏర్పడినదే చోళప్ప మఠం లేదా సమాధి మందిర్. చోళప్ప శ్రీ స్వామి సమర్ధ కంటే ఒకసంవత్సరం ముందు క్రీ.శ.1877 లో ముక్తి పొందారు. ఇప్పటికీ శ్రీ స్వామి వారు అప్పట్లో ధరించిన చర్మ మరియు రజిత పాదుకలు, వారు వాడిన ఇతర సామగ్రిని చోళప్ప మఠం / చోళప్ప గృహం లో చూడవచ్చు.
(3) బాలప్ప – బాలప్ప మఠం
బాలప్ప కర్నాటక లోని ధార్వాడ్ జిల్లా లో హవేలీ గ్రామానికి చెందిన వాడు. వడ్డీ వ్యాపారస్తుడు, ఆస్తిపరుడు. స్వామి ఉమ్మి వేసుకునే పాత్ర కడగటం తో బాలప్ప గురుసేవ మొదలైంది. శ్రీ స్వామి సమర్ధ అందరికీ తమ స్వహస్తాలతో ప్రసాదం పెట్టేవారు. ఒక్క బాలప్పకు తప్ప. పంక్తిలో ఉన్నప్పుడు కుడా బాలప్పకు తప్ప మిగతా అందరికీ ప్రసాదం అందించేవారు. పోను పోను స్వామికి వంట చెయ్యడం , భోజనం పెట్టడం వంటి పనులు కుడా బాలప్పే చేసేవారు. స్వామి తన సేవలో శాశ్వతంగా ఉంచుకోదలచిన వారికి ప్రసాదం పెట్టరని తెలుసుకొని లోలోపల సంతోషించే వాడు. ఒక రోజు స్వామి బాలప్పకి రెండు ఖర్జూరకాయలను ప్రసాదంగా ఇచ్చి, వాటిని తినబోతున్నంతలో లాగేసుకున్నారు.
బాలప్పకి ప్రతీరోజు వారి కులదైవాన్ని పూజించే అలవాటు ఉంది. దానికి శ్రీ స్వామి సమర్ధ ఎత్తిపోడుపుగా “బాలప్ప ముతక దుప్పట్లు వేసుకుంటున్నాడు” అనే వారు, సద్గురు సేవ “ఝరి శాలువా” వంటిది, కులదైవ పూజ “ముతక దుప్పట్లు” వేసుకోవడం వంటిదని శ్రీ స్వామి సమర్ధ భావం. తరువాత తరువాత స్వామి సమర్ధ బాలప్పకి ముందుగా వారి నోట్లోంచి తీసిన కలకండ ను ప్రసాదంగా ఇచ్చారు. తరువాత ఒక తులసి మాలను ఇచ్చారు. పిమ్మట బంగారు ఉంగరాన్ని (రాజ ముద్రను) స్వయంగా శ్రీ స్వామి బాలప్ప వేలికి తొడిగారు . శ్రీ స్వామి సమర్ధ ఎప్పుడూ, ఎన్నడూ తియ్యని వారి మెడ లోని రుద్రాక్ష మాలను తీసి బాలప్ప మెడలో వేసారు. శ్రీ స్వామి సమర్ధ వాడిన ఒక పాత చొక్కాని ఆయనే స్వయంగా బాలప్పకి తొడిగారు. చివరకి వారి కౌపినాన్ని కుడా బాలప్పకే ఇచ్చారు. ఆఖరిగా ఒక జెండాని, నోట్లోంచి కక్కి ఆత్మపాదుకలు ఇచ్చి ఒక మఠాన్ని స్థాపించి అక్కడే ఆ పాదుకలను ప్రతిష్టించమన్నారు.
బాలప్ప మఠం స్థాపించడం కోసం స్థలాన్ని వెతుకుతుంటే, శ్రీ స్వామి సమర్ధ వారు అంజనేయస్వామి వారిని పంపి స్థల ఎంపిక చేసారు. అలా శ్రీ స్వామి సమర్ధ వారి సహాయంతో బాలప్పచే స్థాపించబడినదే నేటి బాలప్ప మఠం. దత్త భక్తులందరూ తప్పక చూడవలసిన ప్రదేశమిది.
(4) నయా ప్యాలెస్ (రాయల్ ప్యాలెస్)
అక్కల్కోట్ లో స్వామి సమర్ధ కు సంబంధించిన గుడులే కాకుండా MSRTC Bus Stand వద్ద గల నయా ప్యాలెస్ (రాయల్ ప్యాలెస్) చూడవలసిన ప్రదేశం. నయా ప్యాలెస్ (రాయల్ ప్యాలెస్) అనేది అక్కల్కోట్ ను పాలించిన రాజుల భవనం. ఇక్కడ గల స్టేట్ మ్యుజియం లో అప్పటి రాచరికపు వస్తువులన్నింటీని భద్రపరిచారు. అప్పటి యుద్ధ సమయాల్లో వాడే వివిధ ఆయుధాలు, 12 నుండి 15 అడుగుల పొడవైన తుపాకులు,అసలైన ఏనుగు కాళ్ళతో చేసిన సోఫాలు, నిజమైన పులి చర్మాల వంటి వెన్నో ఇక్కడ చూడవచ్చు. పెద్దవారికి రూ.5/- పిల్లలకి రూ.3/- ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారు. దయచేసి గమనించండి నయా ప్యాలెస్ (రాయల్ ప్యాలెస్) స్టేట్ మ్యుజియం లోకి ఎంట్రన్స్ వెనుక వైపు నుంచి ఉంటుంది. నయా ప్యాలెస్ (రాయల్ ప్యాలెస్) ముందు గేటు ఎప్పుడూ మూసే ఉంచుతారు.
(5) ఖండోభా మందిర్
అక్కల్కోట్ లో శ్రీ స్వామి సమర్ధ మొదటిసారిగా విచ్చేసిన ప్రదేశం ఖండోభా మందిర్. ఇది అక్కల్కోట్ లో MSRTC Bus Stand ఎదురుగా కలదు. ఇక్కడ శ్రీ గజానన్ మహారాజ్ ప్రతిష్టించిన శ్రీ స్వామి సమర్ధ పాదుకలు కలవు. అక్కడే శ్రీ స్వామి సమర్ధ కి ఇష్టమైన ‘సుందరి’ అనే కోతి సమాధి కుడా కలదు.
శ్రీ స్వామీ సమర్ధ కి ప్రియమైన శిష్యుడు శ్రీ కృష్ణ సరస్వతి గురించి…
శ్రీ కృష్ణ సరస్వతి అతిగా ప్రాచుర్యం పొందని శ్రీ స్వామి సమర్ధ యొక్క అతి ప్రియమైన శిష్యుడు. శ్రీ కృష్ణ సరస్వతి శ్రీ స్వామి సమర్ధ యొక్క అంశ. శ్రీ కృష్ణ సరస్వతి క్రీ.శ. 1836 వ సంవత్సరం కొల్హాపూర్ జిల్లా లోగల ఈచల్ కరంజి దగ్గరలో గల నాందని అనే కుగ్రామం లో జన్మించారు. వారి అసలు పేరు నరహరి. అక్కల్కోట్ వచ్చి వెళ్ళిన తరువాత శ్రీ కృష్ణ సరస్వతి గా ప్రఖ్యాతిగాంచారు. శ్రీ స్వామి సమర్ధ వారే వారికి ‘శ్రీ కృష్ణ సరస్వతి’ అని పేరు పెట్టారు. శ్రీ స్వామి సమర్ధ యొక్క ఆధ్యాత్మిక వారసుడు శ్రీ కృష్ణ సరస్వతి. చిన్న వయసు లోనే శివ సాక్షాత్కారం పొంది, శివుని ఆదేశం మేరకు అక్కల్కోట లోని శ్రీ స్వామీ సమర్ధ ను కలవడానికి బయలుదేరగా.. శ్రీ కృష్ణ సరస్వతి అక్కల్కోట్ చేరుకోక మునుపే శ్రీ స్వామి సమర్ధ చోళప్ప గృహంలో గల భక్తులతో ” ఈ రోజు కృష్ణ వస్తున్నాడు” అని సంతోషంతో అందరితో చెప్పారు. తన దగ్గరకు వచ్చిన శ్రీ కృష్ణ సరస్వతి ని చూసి శ్రీ స్వామి సమర్ధ పరమానంద భరితులయ్యారు. వెంటనే లేచి శ్రీ కృష్ణ సరస్వతికి ఎదురేగి కౌగిలించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత ఇద్దరూ కలిసి అక్కల్కోట్ దగ్గరలోని అడివిలోకి వెళ్లి ఒక వారం తరువాత తిరిగివచ్చారు. శ్రీ కృష్ణ సరస్వతి అక్కల్కోట్ విడిచి వారి తదుపరి ప్రదేశానికి వెళుతున్న రోజున శ్రీ స్వామి సమర్ధ లడ్డూలు చేయించి, ఊరందరికీ భోజనాలు పెట్టారు. శ్రీ కృష్ణ సరస్వతి ఊరికి వెళ్లేముందు శ్రీ స్వామి సమర్ధ ఒక ఆత్మా లింగాన్ని ఇచ్చి “నా యొక్క అంశే నువ్వు. నువ్వు నేను వేరు కాదు. ఇక నుండి నా ఆధ్యాత్మిక కార్యక్రమానికి నువ్వే సారధ్యం వహించాలి” అని చెప్పారు. అలాగే శ్రీ కృష్ణ సరస్వతిని కొల్హాపూర్ లోనే స్తిరపడమని, అక్కడనుండే అందరినీ ఉద్ధరించమని చెప్పారు. శ్రీ స్వామి సమర్ధ శ్రీ కృష్ణ సరస్వతిని ‘కృష్ణా’ అని పిలవగా శ్రీ కృష్ణ సరస్వతి శ్రీ స్వామీ సమర్ధ ని “తాత్యాసాబ్” (గౌరవనీయులైన పెద్దాయన) అని పిలిచేవారు. శ్రీ కృష్ణ సరస్వతి యొక్క శిష్యులే స్వామి వివేకానంద. శ్రీ కృష్ణ సరస్వతి స్వామి వివేకానందకు ‘వాక్సిద్ధి’ (చెప్పినది నిజమయ్యే ఒకానొక శక్తి) ని ప్రసాదించారు. అలాగే వాసుదేవానంద సరస్వతి (టెంబై స్వామి) కుడా శ్రీ కృష్ణ సరస్వతి యొక్క శిష్యులే. శ్రీ కృష్ణ సరస్వతి వృద్ధాప్యం లోకి వచ్చే కొద్ది వారి రూపురేఖలు కుడా అన్నివిధాలా శ్రీ స్వామి సమర్ధనే పోలి ఉండేవి. శ్రీ కృష్ణ సరస్వతి క్రీ.శ.1900 శ్రవణ మాసం లో మహా సమాధి పొందారు.