SPSV Charitamrutham
Sripada Sri Vallahbha Charitamrutham (శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం)
సంపూర్ణ శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృత పారాయణ విధానము
శ్రీపాద శ్రీ చరణాశ్రితులకు ప్రణామములు,
సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం (దత్త విశ్వరూప సమితి, తాడేపల్లిగూడెం వారి ప్రచురణ లేదా LDSS పిఠాపురం వారి ప్రచురణ) ఒక అద్భుతమైన గ్రంధరాజం. దాని విలువ మనకు తెలియాలంటే కనీసంగా రెండుసార్లు పారాయణ చేయాలి. నిజంగా ఈ పుస్తకం తెలుగు భాష లోకి అనువదింపబడి మనకు అందుబాటులోకిరావడం అనేది శ్రీపాదులవారి దయే! అందుకు మనం శ్రీపాద శ్రీ వల్లభ స్వామీ వారికి, సంస్కృత ప్రతిని శ్రీపాదులవారి ఆశీర్వాదములతో మనకు అందించిన శ్రీమాన్ శంకరభట్టు గారికి, తెలుగు ప్రతిని అందుబాటులోకి తెచ్చిన 33వ తరం వక్తి అయిన స్వర్గీయ మల్లాది గోవింద దీక్షితులు గారికి ధన్యవాదములు తెలుపుదాం. చాలామందికి అసలు ఈ పుస్తకం (సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం) ఉన్నట్లే తెలియదు. కొంతమందికి తెలిసినా ఈ పుస్తకాన్ని కొనడంలేదు. ఒకవేళ కొన్నా, దానిని పూజా మందిరంలో పెడుతున్నారు తప్ప (ఉరికే కొని ఇంట్లో పెడితే కొద్దిరోజుల్లో అది మీ ద్వారా ఎవరికి చేరాలో వారికి చేరుతుంది) పారాయణ చెయ్యట్లేదు. భక్తులుసంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం తో ఏవిధంగా సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలో(సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటే శ్రీపాద శ్రీ వల్లభులతో సాన్నిహిత్యాన్నిపెంచుకోన్నట్లే) నా అనుభవం లో తెలిసిన సలహాలను, నేను అనుభవించిన కొన్ని రహస్యాలను మీతో పంచుకుంటాను.
సలహా 1 : పారాయణ ప్రారంబించే భక్తులకు నా మొదటి సలహా ఎంటంటే ఈ గ్రంధం దేవతలచే , మహా మహా యోగులచే పఠించబడిన గ్రంధరాజం. కాబట్టి మిగతా పారాయణగ్రంధాల వలే సులభంగా పూర్తి చెయ్యచ్చు అని అనుకోకండి.. అలాగే ఈ గ్రంధంలో లిఖించబడిన ప్రతీ అక్షరమూ బిజాక్షరమే. ఆ విషయం గ్రంధపారాయణ చేసేకొద్దీ మీకు అవగతమవుతుంది.
II భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రా యుతేన చ
సేతు స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే II
ఆరుసార్లు భూమికి ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో, పదివేల సార్లు కాశీ వెళ్లి వస్తే ఎంతఫలమో, వందలసార్లు రామేశ్వరంలో సేతుదర్శనం చేసి స్నానిస్తే ఎంత ధన్యత కలుగుతుందో… ఆ ఫలమంతా కలిపి ఒక్కసారి తల్లికి నమస్కారం చేస్తే కలుగుతుంది. కాబట్టి పారాయణ ప్రారంబించే ముందు విధిగా తల్లి-దండ్రుల ఆశీర్వ చనాలు తీసుకోవడం మర్చిపోకండి. తల్లిదండ్రులు దగ్గరలో లేనట్లయితే కనీసం ఫోన్ ద్వారా అయినా ఆశీర్వాదం తీసుకొండి. శ్రీపాద శ్రీవల్లభ చరితాంమృతం పారాయణ ప్రారంబిస్తున్నట్లు చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే పారాయణ ప్రారంబించేముందు విధిగా తల్లి-దండ్రుల ఆశీర్వచనాలు తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే శ్రీపాద శ్రీ వల్లభులు విఘ్నేశ్వరుని అంశ. విఘ్నేశ్వరుడు విఘ్ననాయకునిగా ఏవిదంగా అయ్యాడో మనకందరికీ తెలిసిందే. మీరు ఎవరైనా గురువు గారి వద్ద శిష్యరికంలో ఉంటే ఇదే విషయాన్ని గురువుగారికి కూడా చెప్పి వారినుండి కుడా ఆశీర్వాదం తీసుకొని పారాయణ ప్రారంబించండి.
సలహా 2 : క్రొత్తగా సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృత గ్రంధ పారాయణ ప్రారంబించేవారు ముందుగా 17వ అధ్యాయం లోని సిద్ధమంగళ స్తోత్రాన్నికొద్దిరోజుల పాటు ప్రతీరోజూ చదవడం అలవాటు చేసుకోవాలి.
సలహా 3 : అదేవిధంగాకొద్దిరోజుల పాటు శ్రీపాద శ్రీ వల్లభ స్తుతినీ ప్రతీరోజూ చదవడం అలవాటు చేసుకోవాలి.
సలహా 4 : పారాయణ లో ఏ రోజు ఎంత, ఎన్ని పేజిలు చదవాలి అనేది కాకుండా (ఉదాహరణకు మొదటి రోజు ఒకటవ అధ్యాయం నుండి ఆరవ అధ్యాయం వరుకు చదవాలి) మొదటి రోజు మీకు వీలున్నంత చదవండి.
సలహా 5 : పేజిలను లేక్కేస్తూ, హడావిడిగా టైం చూస్తూ పారాయణ చెయ్యడం వృధా అని తెలుసుకోండి.
సలహా 6 : గ్రంధరాజాన్ని చదువుతూ పూజకర్హమైన నామావళి పదాల క్రింద అండర్ లైన్ చేసుకోవాలి (ఉదాహరణకు మొదటి రోజున చదివే ఒకటవ అధ్యాయం లో “అతిప్రాచినుడు”,”నిత్యనూతనుడు” వంటి పదాలు) వాటంన్నింటినీ ఒక చిన్ననోట్ పుస్తకం లో ఏరోజుకారోజు వ్రాసుకోవాలి. పూజకర్హమైన నామావళి పదాలను వ్రాసేటప్పుడు ముందు ‘ఓం’ ను , చివర ‘నమః’ ను చేర్చాలి ( ఉదాహరణకు “అతిప్రాచినుడు”,”నిత్య నూతనుడు” వంటి పదాల ను “ఓం అతిప్రాచీనాయ నమః” అనీ అలాగే “ఓం నిత్య నూతనాయ నమః” అనీ వ్రాసుకోవాలి)
సలహా 7 : కొద్దిగా కఠిన మైన వివరణలు గల ‘చమకము లోని పనసలు’, ‘కణాదుడి కణాద మహర్షి కణ సిద్దంతము’ , ‘2498′ అర్ధ వివరణల వంటి అంశాలను అర్ధం చేసుకోవడానికి సహకరించవలసిందిగా శ్రీపాదుడిని వేడుకోవాలి
సలహా 8 : ఇదే విధంగా అన్ని రోజులూ నిదానంగా అర్ధం చేసుకుంటూ మీకు వీలైనంత ప్రతీ రోజూ చదవండి.
సలహా 9 : మొత్తం గ్రంధం పూర్తవడానికి ఒక నెల రోజులు పట్టినా అస్సలు కంగారుపడకండి
సలహా 10 : ప్రతీ రోజూ శ్రీపాద నామస్మరణ చెయ్యడం అలవాటు చేసుకోండి.
సలహా 11 : గ్రంధ పారాయణ మొదటిసారి పూర్తైన తర్వాత మనం నోట్ బుక్ లో నోట్ చేసుకున్నపూజకర్హమైన నామావళి పదాలను ఉచ్ఛరిస్తూ ఔదుంబర వృక్ష (మేడి) పత్రాలతో, అశ్వత్ధ వృక్ష (రావి) పత్రాలతో, పనస వృక్ష పత్రాలతో పూజ చెయ్యండి. ఎందుకంటే సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృతం నందు లిఖించబడిన ప్రతీ అక్షరమూ సిద్ధశక్తులను, యోగశక్తులను కలిగిన బిజాక్షరాలు. మీరు చేసే ఇటువంటి పూజ యొక్క ఫలితం మీరే అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. ఇది సత్యము.
సలహా 12 : తరువాత మీ అంతట మీరుగా ఒక మంగళవారం చూసుకుని ఖచ్చితంగా, ఉత్సాహంగా రెండవసారి పారాయణ మొదలు పెడతారు. ఇది కుడా జరిగే తీరుతుంది. రెండవసారి పారాయణ మొదలు పెట్టేటప్పుడు ఏ రోజు ఎంత,ఎన్ని పేజిలు చదవాలో అన్ని పేజిలు మీరు చదవగలుగుతారు. దానికి గల కారణం ఇదివరకే శ్రీ పాదుల వారితో మీకు ఏర్పడ్డ అనుబంధం మరియు సాన్నిహిత్యం. ఆ అనుబంధం మరియు సాన్నిహిత్యాన్ని, సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృత గ్రంధ పారాయణ అనుభవాన్ని,ఆనందాన్ని ఆశక్తుడనైన నేను మీకు ఎలా చెప్పగలను?
సలహా 13 : ”ఇంత పెద్ద గ్రంధాన్ని నేను పారాయణ చెయ్యలేను” లేదా “నాకు అంత టైం పర్మిట్ చెయ్యదు” లేదా “సులభమైన సంక్షిప్తీకరించబడినదైతే పరవాలేదు” లేదా “నేను చదవను – కాని వింటాను” అని అనుకునే వాళ్ళు దయచేసి ఇతర మార్గాలద్వారా (నామస్మరణ లాంటివి) శ్రీపాదుని చేరుకోండి.
సలహా 14 : సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితాంమృత పారాయణం లో అర్ధంకాని అంశాలను మాకు keerthivallabha@gmail.com కి మెయిల్ చేస్తే మేము వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. శ్రీపాద భక్త బంధువులకు గల చాల సందేహాలను మన వెబ్సైట్ లోని FAQ పేజి తీరుస్తుందని శ్రీ పాదుని ఆశీస్సులతో తెలియజేసుకుంటున్నాము.
సలహా 15 : సంపూర్ణ శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృత పారాయణ కానివ్వండి ,నామస్మరణ కానివ్వండి, మరేదైనా కానివ్వండి దేనికైనా శ్రీపాదుని కోసం మీరు టైం కేటాయించక తప్పదు. మీ టైంను కేటాయించలేని వారు దత్తాత్రేయం లోకి రాక పోవడమే మంచిది అని నాసలహా.
దిగంబరా..దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా.. దిగంబరా..దిగంబరా.. నృసింహ సరస్వతి దిగంబరా..
మీ
కీర్తి వల్లభ – శ్రీపాద శ్రీ గురు సంగమం సేవా ట్రస్ట్ (రి. 03/2013)
keerthivallabha@gmail.com
Leave a Reply
You must be logged in to post a comment.