Pitlam
త్రేతాయుగం నాటి నవనాథ సిద్ధుల గుహలు – పిట్లం (చిన్నకోడప్‌గల్ గ్రామం)
Navatha Siddha Caves of TrethaYuga At Pitlam (Chinna Kodapgal Village)
దత్తబంధువులందరికీ నమస్కారములు,
నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం దగ్గర SNA (సంగారెడ్డి-నాందేడ్-అకోలా) రోడ్డులో గల చిన్నకోడప్‌గల్ అనే ఒక కుగ్రామం దాటిన తరువాత వచ్చే గుట్ట మీద జనసంచారం లేని అడవిలో త్రేతాయుగపు నాటి నవనాథ సిద్ధుల గుహలు ఉన్నాయని తెలిసి అక్కడకి వెళ్ళడం జరిగింది. చిన్నకోడప్‌గల్ గ్రామాన్ని చేరిన తరువాత అక్కడి స్థానికులను విచారణ చేయగా పలు ఆశక్తికర విషయాలు తెలిసాయి. అక్కడివారు మీరు ఎంతమంది వచ్చారు? అని అడిగారు. ‘మేము ఇద్దరం వచ్చాము’ అని నేను సమాధానం చెప్పాను. మరి రెండవ వ్యక్తి ఏడి? అని అడిగారు. నేను నా జేబులో ఉన్న శ్రీపాద వల్లభుల ఫోటో చూపించాను. దానికి ఆ గ్రామ స్థానికులు “నవనాథ గుహలు” ఒంటరిగా వెళ్లి చూసేవి కాదు. అక్కడ నవనాథులు ‘అడవి గబ్బిలాల (Wild Bats)’ మాదిరిగా గుహలలో ఉండి, దుష్ట ఆలోచనలతో వచ్చేవారిని తరిమి తరిమి కోడతాయని, మొహం మీద గోళ్ళతో రక్తాలోచ్చేలా రక్కుతాయని, గుహ అంత్య భాగానికి చేరాలంటే గురు అనుగ్రహంతో పాటు గుంపులు గుంపులు గా ఉన్న గబ్బిలాలను దాటుకొని ధ్యాసంతా దత్తాత్రేయుల వారిపై నిలిపి నెమ్మదిగా లోపల కెళ్ళాలనీ, ప్రతి గబ్బిలాల గుంపుకు ఒక “రాజు-గబ్బిలం” ఉంటుందని మిగతా గబ్బిలాలు ఊరుకున్నా అది మాత్రం ఉరుకోదని ఒంటరిగా అక్కడకి వెళ్ళాలనే ఆలోచన విరమించుకోమని సలహా ఇచ్చారు. గబ్బిలాల వల్ల హాని జరగక పోతే అక్కడ గల అడవి జంతువులతో ప్రమాదం పొంచి ఉంటుందని, కాబట్టి ఇంత దూరం వచ్చారు కనుక నవనాథ గుహలకు దగ్గరలో గల రుద్రాక్షరూప రామలింగేశ్వర స్వామి గుడి వరుకు వెళ్లి అటునుండి నేరుగా ఇంటికి వెళ్ళమని చెప్పారు. దానికి నేను ‘త్రేతాయుగం నాటి నవనాథ గుహలను చూడడానికే ఇంతదూరం వచ్చా’నని ఊర్లో ఎవరైనా తోడుగా సహాయానికి వస్తే మళ్లీ వచ్చేటప్పుడు బండి మీద దింపుతానని చెప్పాను. కాని ఊరి వారెవరు నాతో రావడానికి ఇష్టపడలేదు. అక్కడకి దగ్గరలో గల రుద్రాక్షరూప రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఎవరైనా ఉంటే తీసుకెళ్ళమని చెప్పారు. శ్రీపాదుడి మీద భారం వేసి గుహల వైపు బండిని పోనిచ్చాను. కొద్దిదూరం బండి మీద వెళ్ళిన నేను, అక్కడనుండి బండి వెళ్ళే పరిస్థితులు కనిపించకపోవడంతో బండిని అక్కడే పార్కింగ్ చేసి కాలి నడకన గుట్ట ఎక్కి అక్కడ గల రుద్రాక్షరూప రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర తోడు కోసం తీసుకెళ్ల డానికి ఎవరైనా ఉన్నారేమో చూసాను. ఆ దరిదాపుల్లో ఎక్కడా జన సంచారం లేదు ఒక్క పండు ముసలావిడ తప్ప. ఆవిడ కుడా ఏదో పారాయణ చేసుకుంటోంది. నాకు ఆవిడని డిస్టర్బ్ చెయ్యాలనిపించలేదు.
శ్రీ పాదుడిని తలుచుకుంటూ నవనాథ సిద్ధుల గుహల వైపుకు వెళ్ళాను. అచ్చటి స్థానికులు చెప్పినట్లుగానే అది ఒక నరసంచారం లేని అడవి. అరిచినా, పిలిచినా పలికే దిక్కేలేదు. కొంతసేపు నడక తరువాత మెట్ల మార్గం కనిపించింది. ఆ మార్గం నేరుగా త్రేతాయుగపు నవనాథ గుహల ద్వారం వద్దకు చేర్చింది. ఇక అక్కడ నుండి గుహల లోపలకి వెళ్ళడమే మిగిలింది.
గుహల ద్వారం వద్ద కొద్ది సేపు కూర్చుని శ్రీపాదుడిని , నవనాథులను ప్రార్ధించి గుహల లోకి అడుగు పెట్టాను. బైట నుండి గుహ లోపలకు చేరే మార్గం చాలా సన్నగా ఒక మనిషికి కుడా సరిపోనంత ఇరుకుగా ఉంది. గుహలోకి రెండడుగులు కుడా పూర్తిగా వేసానో లేదో కాని అక్కడ గుంపులు గుంపులుగా అడవి గబ్బిలాలు కనిపించాయి మరియు దానితో పాటే గుప్పు గుప్పుమని గబ్బిలాల వాసన వచ్చింది. ఆ గబ్బిలాలు కుడా మనం నిలబడితే మన తలకి తగిలే ఎత్తులో… తన్మయత్వంతో తలక్రిందులుగా ఊగుతూ నిద్ర పోతున్నాయి. వెంటనే భయం తోపాటు ‘Bat bite leads to Rabies’ అనే స్టేట్మెంట్ గుర్తుకొచ్చింది. (గబ్బిలం కరిస్తే రేబిస్ వస్తుంది. కుక్క కరిస్తే ఎన్ని జాగ్రత్తలు- ఇంజెక్షన్లు తీసుకోవాలో గబ్బిలం కరిచినా / గీరినా అలాగే ఇంజెక్షన్లు తీసుకోవాలి) అలికిడి చేయకుండా శ్రీపాద శ్రీ వల్లభుడిని, నవనాథులను మనసులోనే స్మరిస్తూ గుహ లోపలి భాగానికి సురక్షితంగా చేరాను. అక్కడ సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం లోని నవనాథులకు సంబందించిన 32వ అధ్యాయాన్ని పారాయణ చేసుకొని అంతే సురక్షితంగా తిరిగి బయటకు వచ్చాను. ఈ విధంగా పైన గల గుహలోకి ఒకసారి క్రింద గల స్వయంభూ శివలింగాలున్న (ఒకే పాన పట్టం మీద గల రెండు స్వయంభూ శివలింగాలు) గుహలోకి మరోసారి వెరశి మొత్తం రెండు సార్లు శ్రీపాదుల వారి దయతో గబ్బిలాల మధ్యలోంచి సాఫీగా ప్రయాణం సాగింది.
అక్కడి నిశ్శబ్దం నిజంగానే మనం త్రేతాయుగంలో ఉన్నామేమో అని అనిపించేలా ఉంటుంది.. అక్కడి గాలి, గుహలు, ఆఖరికి గబ్బిలాలు కుడా ఎంతో పవిత్రమైనవీ మరియు అందరూ దర్శింపలేనివి అని తోచాయి. ఆద్యంతం మనలోని భక్తికి – నమ్మకానికి పరీక్షపెట్టే ఈ చిన్నకోడప్‌గల్ నవనాథసిద్ధుల గుహలు ఎంతో పవిత్రమైనవి. దత్త భక్తులందరూ తప్పనిసరిగా దర్శింపదగినవి. అక్కడ నవనాథులకు ప్రతీకగా గుహల నుండి ఇంకా దూరంగా 9 నిలువెత్తు పుట్టలు, 9 కోనేరులు ఉన్నాయట. వాటిలో కొన్ని కాల క్రమేణా పోయినప్పటికీ 3 కోనేరులను కొన్ని నిలువెత్తు పుట్టలను నేటికీ చూడవచ్చు. అక్కడనుండి తిరిగి రుద్రాక్షరూప రామలింగేశ్వర స్వామి గుడి, అక్కడే గల అతి సుందరమైన అనసూయా మాత – దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించి ట్రిప్ ను ముగించాను.
దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్లభ దిగంబరా..దిగంబరా..దిగంబరా.. నరసింహ సరస్వతి దిగంబరా..అవధూత చింతన శ్రీ గురు దేవదత్త…
మీ
కీర్తి వల్లభ – keerthivallabha@gmail.com
నవనాథులు ఎవరు?…
నవనారాయణాంశ సంభూతులే నవనాధులు వారు శ్రీపాద శ్రీ వల్లభుల ఆజ్ఞ మేరకు, శ్రీ కృష్ణావతారం లో చేసిన వాగ్దానం మేరకు భూమి మీద అవతరించారు. ఋషభ చక్రవర్తికి గల 100 మంది కుమారులలో నారాయణాంశ కలిగిన తొమ్మిది మందే ఈ నవనాథులు.వీరంతా అవధూతలు మరియు దత్తాత్రేయుల వారికి ఆప్తులు. వీరిపేర్లు స్మరిస్తే చాలు శ్రీ పాద వల్లభులు సంతుష్టి చెందుతారు. నవనాథుల తో పాటుగా అడ్భంగుడు (కాపువాడు) మరియు మీననాథుడు (మత్సేంద్రనాధుడి కుమారుడు) కుడా నవనాథులు ఎంత ప్రసిద్ధి పొందారో అంతే ప్రసిద్ధిపొందిన వారు. వీరంతా ‘నాథసంప్రదాయం’లో ఉన్నవారు.
నవనాథులు |
---|
నవనాథులు |
1. మత్సేంద్రనాథుడు |
2. గోరక్షనాథుడు |
3. జాలంధరనాథుడు |
4. కానీఫానాథుడు |
5. చర్పటనాథుడు |
6. నాగనాథుడు |
7. భర్తరినాథుడు |
8. రేవణనాథుడు |
9. గహనీనాథుడు |
ఎలా చేరుకోవాలి?…
హైదరాబాద్ నుండి చిన్నకోడప్‌గల్ (పిట్లం) నవనాథసిద్ధుల గుహలను చేరుకోవడానికి రూట్ (Hyderabad To Chinna Kodapgal 190 KM) |
---|
హైదరాబాద్ నుండి చిన్నకోడప్‌గల్ (పిట్లం) నవనాథసిద్ధుల గుహలను చేరుకోవడానికి రూట్ (Hyderabad To Chinna Kodapgal 190 KM) |
కుకట్ పల్లి ----> BHEL----> పటాన్ చెరు ----> పటాన్ చెరు టోల్ ప్లాజా ----> ORR దగ్గర స్ట్రైట్ రోడ్డు (ముంబై రోడ్డు) తీసుకోవాలి ----> ఇస్నాపూర్ ----> రుద్రారం ----> రుద్రారం తోషిబా & విజయ్ ఎలక్ట్రానిక్స్ ----> రుద్రారం తోషిబా & విజయ్ ఎలక్ట్రానిక్స్ దాటగానే వచ్చే రైట్ సైడ్ రోడ్డు తీసుకోవాలి (ముంబై హైవే దిగాలి) ----> గణేష్ గడ్డ ----> ఇస్మాయిల్ఖాన్ పేట్ ----> ఇస్మాయిల్ఖాన్ పేట్ దాటాక వచ్చే 4 రోడ్లలో లెఫ్ట్ (ఎడమ) రోడ్డు తీసుకోవాలి ----> MNR మెడికల్ కాలేజి ----> MNR మెడికల్ కాలేజి దాటాక వచ్చే ' T ' జంక్షన్ లో (3 రోడ్ల కూడలి) రైట్ (కుడి) రోడ్డు తీసుకోవాలి ----> ఆంథోల్ & జోగిపేట్ ----> అన్నాసాగర్ లేక్ ----> శంకరంపేట సహజ కలువల కొలను ----> శంకరంపేట ----> నాందేడ్ రోడ్ ----> పిట్లం ----> SNA రోడ్ ----> చిన్నకోడప్‌గల్ గ్రామం ----> గుట్ట మీద నవనాథ సిద్ధుల గుహలు |
చిన్నకోడప్‌గల్ నవనాథసిద్ధుల గుహల మరియు వాటి పరిసర ప్రాంతాల ఫోటోలు
ఎప్పుడు, ఎలా దర్శించుకోవాలి?
ఒంటరిగా కాకుండా, వానాకాలంలో కాకుండా చిన్నకోడప్‌గల్ నవనాథసిద్ధుల గుహలను ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరుకు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. కార్తిక పౌర్ణమి, శివరాత్రి రోజులలో జాతర జరుగుతుంది. ఆ సమయంలో కుడా దర్శించుకోవచ్చు.
ప్రత్యేకత ఏంటి?
- త్రేతాయుగం నాటి నవనాథసిద్ధ గుహలు ఉండడం
- శ్రీరాముడు ప్రతిష్టించిన రామలింగేశ్వరుడు ఉండడం
- ఇక్కడి శ్రీరామ ప్రతిష్టిత శివలింగం ప్రపంచంలో మరెక్కడాలేనట్లు రుద్రాక్షరూపము లో ఉండడం
- నాగుపాము శివలింగాభిషేకం చేయడం (ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో ఈ ఘట్టం కనిపిస్తుంది)
- అనసూయా మాత – దత్తాత్రేయుడు ఉన్న గుడి ఉండడం
- నవనాథులకు ప్రతీకలుగా ఉన్న 9 కోనేరులు, 9 నిలువెత్తు పుట్టలు ఉండడం
- నవనాథ సిద్ధ గుహలను అపవిత్రం చేయకుండా అడవి గబ్బిలాలు కాపలాకాస్తూ ఉండడం
- నవనాథసిద్ధుల క్రింది గుహలో ఒకే పానపట్టం (Platform) పై రెండు శివలింగాలుండడం
- రుద్రాక్షరూప రామలింగేశ్వర గుడి ప్రాంగణంలో పాండురంగ విఠలుడుండడం
- రుద్రాక్షరూప రామలింగేశ్వర గుడి ప్రాంగణంలో త్రిమాతా స్వరూపిణులు ఉండడం
ఏమేమి తీసుకెళ్ళాలి?
శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకజలం, ఆవుపాలు, పన్నీరు, పూలు, ఫలాలు తీసుకెళ్ళాలి. దయచేసి గమనించండి నవనాథసిద్ధుల గుహల పరిసర ప్రాంతాలలో ఏమి దొరకవు. కాబట్టి కావలసిన పూజా సామాగ్రి మనమే వెంట తీసుకెళ్ళాలి. అలాగే పారాయణ చేసుకోవడానికి నవనాథుల చరితము, సంపూర్ణ శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం వంటి గ్రంధాలను తీసుకెళ్ళాలి.
లబించే సౌకర్యాలు
నవనాథసిద్ధుల గుహల పరిసర ప్రాంతాలలో ఏమి దొరకవు. ఎటువంటి సౌకర్యాలు లభించవు. తాగడానికి నీటి నుండి తినడానికి తిండి వరుకు అన్ని తీసుకెళ్ళాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ‘స్పోర్ట్స్ షూ’ దరించి వెళ్ళాలి (గుహ లోపలకు కాదు)
- మనస్సును దత్తాత్రేయుని మీదా, నవనాథుల మీదా కేంద్రీకరింపజేయాలి
- గుహల లోకి అడుగు పెట్టేటప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ముందుకు అడుగేయాలి
- గబ్బిలాలను చూసి అరవడం, వాటిని కొట్టడం చేయరాదు. అలాగే అయినదానికీ – కానిదానికీ హడావిడి పడరాదు
- గబ్బిలాలు మీ తలలకు తగులుతున్నా మీరు తల వంచుకొని మనస్సులో దత్త నామస్మరణ చేస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి
- గుహల లోకి అడుగు పెట్టేటప్పుడు మీ మొబైల్ ఫోన్లను స్విచ్ఆఫ్ చెయ్యాలి
- సామూహికంగా / గ్రూప్ గా వెళ్ళినప్పుడు అక్కడి ప్రశాంతతకుగాని, గబ్బిలాల నిద్రకుగాని భంగం కలిగించరాదు
- గుహ అంత్యానికి చేరుకునే వరుకు అస్సలు మాట్లాడరాదు
- సాధ్యమైనంత ఎక్కువ నిశ్శబ్దాన్ని పాటించాలి
- గబ్బిలాలను ఫోటోలు తీసేటప్పుడు ఫ్లాష్ వాడరాదు
- గుహ లోపల మంటలు-పొగలు పెట్టరాదు
దగ్గర లోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు
చిన్నకోడప్‌గల్ (పిట్లం) నవనాథసిద్ధుల గుహలకు దగ్గరలో గల ఇతర దర్శనీయ ప్రదేశాలు |
---|
చిన్నకోడప్‌గల్ (పిట్లం) నవనాథసిద్ధుల గుహలకు దగ్గరలో గల ఇతర దర్శనీయ ప్రదేశాలు |
1. హైదరాబాద్ నుండి చిన్నకోడప్‌గల్ గ్రామం వెళ్ళే దారిలో ఇస్మాయిల్ఖాన్ పేట్ కు ముందు గల 'గణేష్ గడ్డ' లో ఉన్న 20 అడుగుల శనేశ్చర దేవాలయం |
2. చిన్నకోడప్‌గల్ గ్రామానికి 10 KM ల దూరం లో గల 'ఎంపల్లి' సిద్ధి హనుమాన్ దేవాలం |
3. చిన్నకోడప్‌గల్ గ్రామానికి 7 KM ల దూరం లో గల నిజాంసాగర్ పిక్నిక్ పర్యాటక ప్రదేశం |