కోటి సూర్యుల తేజస్సు(ఙ్ఞానం), కోటి చంద్రుల చల్లదనం(బ్రహ్మానందం)తో
దేవతలందరిచే పూజించబడు విశ్వాశ్రయుడు,భక్తప్రియుడు,శ్రేష్టుడూ అయిన
అత్రిపుత్రుడువైన ఓ నరసింహ సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను - నన్ను రక్షించు. [1] |
మోహపాశమనే అఙ్ఞానాంధకారాన్ని నశింపజేయగల
ఙ్ఞానసూర్యుడవైన నీవు విశాల నేత్రములు కలవాడవు,
భక్తులకు వరములిచ్చు లక్ష్మీపతివి అయిన
ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను - నన్ను రక్షించు. [2] |
మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించి అణచగల
అంకుశము వంటి వారు మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్త అయిన
పరమాత్మ యొక్క అవతారలన్నింటిలో శ్రేష్టుడవైన శ్రీవల్లభా
ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను - నన్ను రక్షించు. [3] |
ఆకాశము,వాయువు, అగ్ని, జలము, భూమి అను పంచభూతాత్మకమైన
సృష్టికి కర్తవైవుండి సూర్య చంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు
జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా, నీవు భక్తుల పాలిట కామధేనువు వంటి వాడవు.
ఓ శ్రీగురు నరసింహ సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను - నన్ను రక్షించు. [4] |
తామరరేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి
తేజస్సు గల శ్రీగురు, ప్రచండమైన మా యీ పాపాలను
పారద్రోలడానికి దండము ధరించి యతివేషధారి అయిన
నరసింహ సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను - నన్ను రక్షించు. [5] |
మీ పాదకమలాలను వేదాలు శాస్త్రాలు స్తుతిస్తున్నాయి
నాదుబిందు కళాస్వరూపా నీవు వాటికి కూడా అతీతుడవైయుండి
మూడు విధములైన తాపాలతో పీడింపబడుతున్న భక్తుల పాలిట
కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను - నన్ను రక్షించు. [6] |
అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మ సంతుష్టుడవై వున్న ఙ్ఞానసాగరా
కృష్ణావేణీ పంచనదీ సంగమతీర నివాసా ! కష్టాలను దైన్యాన్ని
దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు
నృసింహ సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నను - నన్ను రక్షించు. [7] |
శ్రీ నృసింహేస్వరా ! నీ పేరే పరమాత్మ వాక్కులకు, చూపులకు నీ మార్గం అందదు
ఆది మధ్యాంతములు నీకు లేవు. నీశక్తి అనంతము, నీ భావము తర్కింపరానిది
అద్వితీయుడవైన నీకు నమస్కరిస్తున్నను - నన్ను రక్షించు. [8] |
ఫలశృతి:
నిత్యమూ ఈ నృసింహ సరస్వతీ అష్టకం ఎవరు చదువుతారో
వారికి ఙ్ఞానానుసారం దీర్ఘాయువు ఆరోగ్యం సర్వసంపదలు
నాలుగు పురుషార్ధాలు లభిస్తాయి.ఈ అష్టకం ఘోరమైన సంసారమనే
సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. |